యువతి, యువకులు ఒత్తిడికి లోనుకాకూడదు – విజయసాయి రెడ్డి

-

యువతి, యువకులు ఒత్తిడికి లోను కాకూడదన్నారు విజయసాయి రెడ్డి. ఇండియాలో 15–24 ఏళ్ల మధ్య వయస్కులైన 25 కోట్లకు పైగా ఉన్న యువతీయువకుల మానసిక అవసరాలకు కూడా వారి శారీరక ఆరోగ్యానికి ఉన్నంత ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఈ విషయాన్ని ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. యువత మనోవికాసమే సర్వతోముఖ అభ్యుదయానికి గీటురాయి అని పాశ్చాత్య దేశాల్లో రుజువైంది. ఈమధ్య ముంబై, ఢిల్లీ నగరాల్లో కొందరు యువకులు చేసిన హత్యలు, రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కొందరిని చుట్టుముడుతున్న హింసాప్రవృత్తి ఆలోచనాపరులను తీవ్ర అలజడికి గురిచేస్తున్నాయన్నారు.

21వ శతాబ్దంలో పుట్టిన టీనేజర్లు కొత్త వాతావరణంలో రూపుదిద్దుకుంటున్న, వేగంగా మారుతున్న, ఎదిగిపోతున్న ప్రపంచంలో బతుకున్నారు. ఇంటర్నెట్‌ సర్వత్రా అందించే సమస్త సమాచారం కౌమారదశకు చేరిన నేటితరం పిల్లలకు పూర్తిగా మేలు చేసేదిగా లేదు. కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న పరిజ్ఞానం, సమాచారం, విజ్ఞానం ఈ యువతకు భారంగానే కనిపిస్తున్నాయి. దీనికితోడు చదువు, తర్వాత ఏఏ వృత్తుల్లో ప్రవేశించి పైకి ఎగబాకాలనే అంశాలు యువతీయువకులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి. వారిలో ఆతృతను, అలజడిని పెంచేస్తున్నాయి. భారతదేశంలోని పిల్లలకు ఏం చేయాలనే విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కాని, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి, ఆర్థికంగా తగినంత మద్దతు, సరైన మార్గదర్శనం లేకపోవడం యువత ప్రధాన సమస్యలు. ఇంతకు ముందు తరానికి లేని సమాచారం ఇప్పుడు కొత్త తరం పిల్లలకు అందుబాటులో ఉన్నా దాని వల్ల వచ్చే ప్రయోజనాలు కనిపించడం లేదు. యువతీయువకులు తాము అనుభవిస్తున్న మానసిక సమస్యలు, అలజడి గురించి బయటకు చెప్పుకునే వాతావరణం ఇంకా మనం సృష్టించలేకపోతున్నాం. ఇంట్లోగాని, క్లాసురూముల్లోగాని వారి సమస్యలు చెప్పుకుని చర్చించలేకపోతున్నారు. దీంతో జనంతో అందరి మధ్య ఉన్నాగాని ఒంటిరితనం యువతను పీడిస్తోంది. ఈ పరిస్థితులు భారత యువజనుల మానసిక సమస్యలను జటిలంచేస్తున్నాయన్నారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version