సికింద్రాబాద్ కంటోన్మెంటు భూములపై విజయసాయి సంచలన పోస్ట్ చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాల లక్షలాది ఎకరాల భూములు నగరపాలకసంస్థల పరిధిలోకి తీసుకురావాలనే కేంద్ర సర్కారు నిర్ణయం– ప్రజలకు నిజంగా శుభవార్తే!ఆర్మీ, నగర పౌరుల మధ్య సికింద్రాబాద్ తరహా ట్రాఫిక్ వివాదాలకు ఇక తెర! అంటూ పేర్కొన్నారు. దేశంలోని సైనిక కంటోన్మెంట్లను రద్దు చేసి, వాటిలోని పౌర నివాస ప్రాంతాలను పక్కనున్న నగర పాలకసంస్థల్లో విలీనం చేయాలని, ఇక నుంచి కంటోన్మెంట్లను మిలిటరీ స్టేషన్లుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది ప్రజలకు నిజంగా శుభవార్త అని వివరించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంటు బోర్డు పరిధిలోని కొన్ని చోట్ల సైనిక దళాలు వాడుకునే రోడ్లపై పౌరులు తిరగకుండా ఆంక్షలు విధించినప్పుడు గత కొన్నేళ్లుగా నగరంలో అలజడి చెలరేగడం తెలుగు ప్రజానీకానికి తెలుసు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా దేశంలోని ఈ కంటోన్మెంట్లలో సైన్యానికి అవసరం లేని, ప్రస్తుతం ఉపయోగంలో లేని లక్షలాది ఎకరాల ఖాళీ భూములను ఆయా నగరాలు, పట్టణాలు లేదా రాష్ట్రాలకు అప్పగిస్తారన్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఆగ్రా వంటి 62 కంటోన్మెంటు నగరాల్లో ఖాళీ జాగాల కొరతతో జనసాంద్రత పెరిగిపోతోంది. చాలీచాలని పౌర సదుపాయాలతో జనం ఈ పట్టణాలు, నగరాల్లో నానా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.