భారత ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి ట్వీట్‌

-

ఇండియా ప్రజాస్వామ్యంపై విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యంగా ఇండియాను, అతిగొప్ప ప్రజాతంత్రదేశంగా అమెరికాను నేడు జనం కీర్తిస్తున్నారు. ఈ రెండు దేశాలకు మరో పోలిక కూడా ఉంది. రెండు దేశాల్లోనూ 19వ శతాబ్దం ద్వితీయార్ధంలో పుట్టిన రిపబ్టికన్‌ పార్టీ (1854), భారత జాతీయ కాంగ్రెస్‌ (1885)లను గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీలుగా (జీఓపీ) పిలుస్తారన్నారు. ప్రస్తుతం ఈ రెండు పాత రాజకీయపక్షాలూ రెండుచోట్లా ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇండియా, అమెరికా దేశాల్లో 2024 ప్రథమ, ద్వితీయార్ధాల్లో వరుసగా జరిగే ఎన్నికల్లో ఈ రెండు జీఓపీ (ఘనమైన పాత పార్టీ)లు మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నాయి. అమెరికాలో బానిస వ్యవస్థను రద్దుచేయించిన అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ రిపబ్లికన్‌ పార్టీ నేత అనే విషయం చాలా మందికి తెలియదని తెలిపారు.


అమెరికాలో 150 ఏళ్లకు ముందు నుంచే రిపబ్లికన్, డెమొక్రాటిక్‌ అనే రెండు పార్టీలు మాత్రమే ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వచ్చే ఆనవాయితీ స్థిరపడిపోయింది. అధ్యక్షతరహా పాలనా వ్యవస్థ అమలులో ఉన్న అమెరికాలో మొదట లిబరల్‌ (ఉదారవాద) పార్టీగా పేరున్న రాజకీయపక్షం రిపబ్లికన్‌ పార్టీ. కాని, 1960లో జాన్‌ ఎఫ్‌ కెనడీ అధ్యక్షుడిగా ఎన్నికయినప్పటి నుంచీ డెమొక్రాటిక్‌ పార్టీ తన కొత్త విధానాలతో మైనారిటీల అనుకూల ఉదారవాద రాజకీయపక్షంగా పేరు సంపాదించింది. 21వ శతాబ్దంలో 2000, 2004 ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీనేత జార్జి డబ్ల్యూ బుష్‌ దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వరుసగా 2008, 2012 ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా గెలిచారు. తర్వాత హోరాహోరీగా జరిగిన 2016 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించారన్నారు.

ఆయన చేతిలో ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ (డెమొక్రాటిక్‌ పార్టీ) గతంలో రెండుసార్లు ప్రెసిడెంట్‌ గా పనిచేసిన బిల్‌ క్లింటన్‌ భార్య అనే విషయం తెలిసిందే. కొవిడ్‌–19 ఉధృతంగా వ్యాపించిన 2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో పదవిలో ఉన్న ప్రెసిడెంట్‌ ట్రంప్‌ భారీ తేడాతో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ చేతిలో ఓడిపోయారు, ఈ శతాబ్దంలో ఒక్కసారి మాత్రమే గెలిచిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ఆయన రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి అధ్యక్ష పదవికి పోటీచేసేందుకు రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌ గట్టి ప్రయత్నం చేస్తున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version