శ్రీరామనవమి వేడుకల్లో ఘర్షణలు.. బెంగాల్‌, బీహార్‌లో ఉద్రిక్తత.. 144 సెక్షన్‌ అమలు

-

పలు రాష్ట్రాల్లో శ్రీరామనవమి సందర్భంగా చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్​లో శ్రీరామ నవమి రోజున ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో బిహార్, బెంగాల్​లోని పలు జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బిహార్‌లోని ససారామ్‌, నలందా జిల్లాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకుగాను పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. ప్రజలు గుంపులు గుంపులుగా బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని హెచ్చరించారు.

బెంగాల్‌లోని హౌరా జిల్లాలో రామ‌న‌వ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్షణ‌లో అల్లరి మూక‌లు ప‌లు వాహ‌నాల‌ను ధ్వంసం చేయ‌డంతో పాటు దుకాణాల‌ను లూటీ చేశాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇప్పటికే 31 మందిని అరెస్ట్ చేశామ‌ని అధికారులు చెప్పారు. ద‌ల్కోల ప్రాంతంలో జ‌రిగిన ఘ‌ర్షణ‌లో ఓ వ్యక్తి మ‌ర‌ణించ‌గా ప‌లువురికి గాయాల‌య్యాయి. మూకలను చెదరగొట్టడానికి పోలీసులు టియర్‌గ్యాస్‌ ప్రయోగించారు. ఈ నేపథ్యంలో హౌరాలోని శివ్‌పూర్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. 144 సెక్షన్‌ అమలుచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version