విజన్ 2047 పేరిట ప్రజలను మభ్యపెట్టి.. మాయ చేసేందుకు సీఎం చంద్రబాబు మరోసారి పబ్లిసిటీ స్టంట్ కి దిగారని మాజీ సీఎం జగన్ విమర్శలు చేశారు. 1998లో కూడా చంద్రబాబు 2020 విజన్ అన్నారు. ప్రస్తుతం 2047 విజన్ అంటున్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఎన్ని అబద్దాలు అయినా ఆడుతారని చంద్రబాబు పై జగన్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దానికి ఇవాళ మంత్రి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు.
విజన్ గురించి ప్రిజనరీకి ఏం తెలుస్తుందన్నారు. దోచుకోవడం, దాచుకోవడంలో జగన్ ను మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు. విజన్ 2020ని ఎగతాళి చేసినోళ్లే నేడు ఫలితాలు అనుభవిస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల గురించి మాట్లాడే జగన్.. సైబరాబాద్ చూసి తెలుసుకోవాలి. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన చరిత్ర జగన్ ది. చంద్రబాబు విజన్ మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు. రాష్ట్రానికి జగన్ చేసిన ద్రోహాన్ని గుర్తించిన ఏ ఒక్కరూ క్షమించరని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.