బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని మంగళగిరి గ్రామీణ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సురేష్ ముందస్తు బెయిల్ ని హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సురేష్ ని అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కొన్ని రోజులుగా ఆయన కోసం వెతుకుతున్న పోలీసులు పక్కా సమాచారంతో గురువారం హైదరాబాద్ లోని మియాపూర్ లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో ఆయనని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో నందిగం సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబీలత ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలోనూ తన భర్తపై పోలీస్ స్టేషన్ లో హత్యయత్నం జరిగిందని ఆరోపించారు. సురేష్ ని రాత్రి ఒంటిగంటకు అరెస్టు చేశారని.. హైదరాబాద్ నుండి తీసుకువచ్చే క్రమంలో తన భర్తను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా టిడిపి కార్యాలయం పై దాడి కేసులో సురేష్ ని అరెస్ట్ చేశారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏం జరిగినా చంద్రబాబుదే బాధ్యత అని అన్నారు బేబీలత.