మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో సిట్ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కావాలంటే తాను రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని దానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదన్నారు. తనపై వ్యంగ్యంగా కథనాలు రాస్తున్నారని.. తనకు నచ్చిన పని చేస్తానని చెప్పారు. 2014 నుంచి వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీని తానొక్కడినే నడిపించానని చెప్పారు. విజయసాయి ఎప్పటికైనా వెన్నుపోటు పొడుస్తారంటూ తమ నాయకుడికి ఎక్కిస్తూ వచ్చారని తన పదవులు అన్ని పోయాయని చెప్పారు.
రెండో స్థానంలో ఉన్న తనను కొటరీ వేధింపులకు గురిచేసి 2వేల స్థానంలో నిలబెట్టారని పేర్కొన్నారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లనే వైసీపీకి రాజీనామా చేశానని.. ఇకపై తనకు సంబంధించిన వార్తలు రాయవద్దని సూచించారు. లిక్కర్ కేసుకు సంబంధించి రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలరని.. మొదటి మూడు నెలల్లో జరిగిన పరిణామాలే తనకు తెలుసు అన్నారు. తాను లోన్ మాత్రమే తీశానని.. ఆ తరువాత జరిగిన పరిణామాలు తనకు తెలియవని చెప్పారు.