- కోదండ రామాలయ పాలక వర్గం ఏర్పాటు
- అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం
శ్రీకాకుళం నగరం : స్థానిక పాలకొండ రోడ్డులో ఉన్న కోదండ రామాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు.కొత్త పాలకవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైదిక కార్యక్రమాల నిర్వహణ పైనా,అదేవిధంగా ఇక్కడి కార్యకలాపాలపైనా భక్తులలో నమ్మకం పెరిగేలా కొత్త పాలకవర్గం పనిచేయాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా తన వంతు సాయం తప్పక ఉంటుందని అన్నారు. ట్రస్టు బోర్టు ల ఏర్పాటుతో హిందూ ధర్మ వ్యాప్తితో పాటు ముఖ్యమయిన పండుగల నిర్వహణ కూడా వైభవోపేతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.
రానున్న నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చేలా కృషి చేయాలని పాలక మండలికి సూచించారు. దేవాలయాల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అర్చకుల జీతభత్యాల పెంపుపై చర్యలు చేపట్టామని అన్నారు. ముఖ్యంగా ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయి ఉన్నాయని, వీటిని గుర్తించి ఆక్రమణల తొలగింపు అన్నది కష్టంగానే ఉందని చెప్పారు. ఆ రోజు దాతలు ఏ ప్రయోజనం ఆశించి ఇచ్చారో అది ఇప్పుడు నెరవేరడం లేదని ఆవేదన చెందారు.
ఆలయానికి ఆదాయం ఇచ్చే ఆస్తుల పెంపుదలకు కృషి చేయాలని, ఏమయినా అవసరం ఉంటే తాను కూడా సహకరిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న అన్ని దేవాలయాలకు కూడా పాలక మండళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఆలయాల ఆస్తుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించేలా సంబంధిత వర్గాలు పనిచేస్తే ఇంకా మేలు అని అన్నారు. తొలుత పాలకవర్గ చైర్మన్ గా చెట్టు నాగేశ్వరరావు, సభ్యులుగా బైరి జగదీశ్వరరావు, భాసురు సుధాకరరావు,చేబ్రోలు నిర్మల, కాయల అనిత,పేర్ల రాజా బాయ్, కూన తాయారమ్మ,ఎక్స్ ఆఫీషియో మెంబర్ గా బంకుపల్లి శేషగిరి రావు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో మాజీ మునిసిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, అరసవల్లి క్షేత్ర ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, గుమ్మా నగేష్, కోణార్క్ శ్రీను, చల్లా శ్రీను,అంధవరపు సంతోష్, సాధు వైకుంఠరావు, అంబటి శ్రీను,గోండు కృష్ణ మూర్తి, గోండు కృష్ణ, మండవిల్లిరవి, బైరి మురళి, గుడ్ల దాము, చౌదరి సతీష్, అల్లు లక్ష్మీనారాయణ, మహిబుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.