తిరువూరులో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలపై మండిపడ్డారు. ముఖ్యంగా సీఎఁ జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రికి తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారని మండిపడ్డారు. ఐదేళ్లయినా.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊసే లేదని అన్నారు.
‘మన బిడ్డల భవిష్యత్తుపై జగన్ ఆలోచించట్లేదు. మూడు రాజధానులన్నారు.. ఒక్కటి కూడా లేదు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకువచ్చారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలి. జగన్‌ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారు. జగన్ పాలనలో రైతులంతా అప్పులపాలయ్యారు. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి అన్నారు.. ఏమైంది? ఒక్క ఏడాదైనా రైతుల కోసం రూ. 3 వేల కోట్లు పక్కన పెట్టారా? పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ అన్నారు.. ఏమైంది?’ అని షర్మిల నిలదీశారు.