దేశంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 15.88కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 మంది మహిళలు, 5,929 ఇతరులు ఉన్నారు. రెండో దశ బరిలో 1,202 అభ్యర్థులు నిలవగా.. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, సీనియర్ నటి హేమమాలిని వంటి ప్రముఖులు ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్ ముగియనుంది. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1 ముగియనుండగా.. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.
మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉదయం 9 గంటల వరకు మోస్తరుగా పోలింగ్ శాతం నమోదైంది. త్రిపుర – 16.65 శాతం, బంగాల్- 15.68, ఛత్తీస్గఢ్- 15.42, కర్ణాటక- 9.21, రాజస్థాన్- 12, అసోం- 9.15 శాతం పోలింగ్ నమోదైంది. ఎండ ముదురుతుండటంతో మధ్యాహ్నం పూట ఇంకా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సాయంత్రం 4 తర్వాత మళ్లీ ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరే అవకాశం ఉందని తెలిపారు.