ఏపీ ఎన్నికల పోలింగ్ వేళ పలు చోట్ల రణరంగం తలపిస్తోంది. పోలింగ్ ఏజెంట్ల కిడ్నాప్ ఓవైపు.. పోలింగ్ కేంద్రాల్లో గొడవలు మరోవైపు.. మొత్తానికి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి ఈ ఎన్నికలు. పోలింగ్ రోజున వైసీపీ నేతల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత ఉన్నా బలవంతంగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి అరాచకాలకు పాల్పడుతున్నారు ఆ పార్టీ నేతలు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయిలో జనసేన ఏజెంట్ రాజారెడ్డిని వైసీపీ నేతలు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు లాక్కెళ్లిపోయారు. తమ ఏజెంట్‌ను కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో ఇడుపులపాయలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఈ ఘటనపై స్పందించారు. ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఏపీ కాంగ్రెస్ చీఫ్.. ఓటు అనేది పని కాదు, మన బాధ్యత అని అన్నారు. ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కడప పార్లమెంటులో జరుగుతున్న దాడులపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈవీఎంలు ధ్వంసం చేసిన వైసీపీ అభ్యర్థిని బహిష్కరించాలని ఎన్నికల అధికారిని కోరారు.