లింక్ ఓపెన్ చేస్తే మటాషే..! ఆండ్రాయిడ్ ఫోన్లకు కొత్త ర్యాన్సమ్‌వేర్ వైరస్..

-

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్/ఫైల్‌కోడర్.సి అనే ఓ ర్యాన్సమ్‌వేర్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుందని ఎసెట్ అనే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ చేసిన పరిశోధనలో తేలింది. సదరు ర్యాన్సమ్‌వేర్ థర్డ్‌పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు లేదా పోర్న్ సైట్లను చూసినప్పుడు ఫోన్‌లో యాప్ రూపంలో ఇన్‌స్టాల్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్గాల్లో ఫోన్లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బు కాజేస్తున్నారు. గతంలో కంప్యూటర్లకు సోకిన వాన్నక్రై వినియోగదారులకు ఎంతటి భారీ నష్టాన్ని కలిగించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లకు కూడా అలాంటి ఓ ర్యాన్సమ్ వేర్ వ్యాప్తి చెందుతోంది. ఇంతకీ అసలు ర్యాన్సమ్ వేర్ అంటే ఏమిటంటే…

వినియోగదారులకు చెందిన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు ర్యాన్సమ్‌వేర్ వైరస్ వ్యాప్తి చెందితే సదరు డివైస్ లాక్ అవుతుంది. దాని లాక్‌ను ఓపెన్ చేయాలంటే.. హ్యాకర్లు కొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తారు. సదరు డివైస్‌లో ఉన్న యూజర్ డేటాను బట్టి వారు డబ్బులు వసూలు చేస్తారు. దీంతో చేసేది లేక వినియోగదారులు సదరు హ్యాకర్లకు డబ్బులు చెల్లించి తమ తమ డివైస్‌లను అన్‌లాక్ చేయించుకుంటారు. ఈ క్రమంలో వినియోగదారులు పెద్ద ఎత్తున డబ్బులు నష్టపోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్/ఫైల్‌కోడర్.సి అనే ఓ ర్యాన్సమ్‌వేర్ పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుందని ఎసెట్ అనే ఓ ఐటీ సెక్యూరిటీ సంస్థ చేసిన పరిశోధనలో తేలింది.

సదరు ఆండ్రాయిడ్/ఫైల్‌కోడర్.సి అనే ర్యాన్సమ్‌వేర్ గూగుల్ ప్లే స్టోర్ కాకుండా ఇతర వెబ్‌సైట్లలోని థర్డ్‌పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు లేదా పోర్న్ సైట్లను చూసినప్పుడు ఫోన్‌లో యాప్ రూపంలో ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తరువాత ఆ ఫోన్‌లో ఉండే యూజర్‌కు చెందిన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ఇతరులకు ఎస్‌ఎంఎస్‌లను పంపుతుంది. దీంతో ఆ ఎస్‌ఎంఎస్‌లను ఓపెన్ చేసే వారు అందులో ఉండే లింక్‌ను క్లిక్ చేస్తే వెంటనే ఆ ర్యాన్సమ్ వేర్ వారి ఫోన్లలో కూడా ఇన్‌స్టాల్ అవుతుంది. ఆ తరువాత ఫోన్లు ఆటోమేటిక్‌గా లాకవుతాయి. ఇక వాటిని అన్‌లాక్ చేయాలంటే.. హ్యాకర్లకు డబ్బులు చెల్లించాల్సిందే. కనుక ఎవరైనా సరే తమకు వచ్చే ఎస్‌ఎంఎస్‌లలో ఉండే లింక్‌లను ఓపెన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని ఐటీ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలని, పోర్న్ వెబ్‌సైట్లను చూడకూడదని కూడా వారు సూచిస్తున్నారు. కనుక మీరు కూడా ఈ ర్యాన్సమ్‌వేర్ పట్ల జాగ్రత్తగా ఉండండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version