ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు చెందిన డివైస్‌లలో కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ క్రాష్ అవుతున్నాయి. మన దేశంలోనూ కొందరు యూజర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలోని జీమెయిల్ యాప్ ఎక్కువగా క్రాష్ అవుతుందని ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ స్పందించింది.
ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లలో జీమెయిల్‌ను ఓపెన్ చేయలేకపోతున్నారని, ఓపెన్ చేసినా యాప్ క్రాష్ అవుతుందని తాము గుర్తించామని గూగుల్ తెలిపింది. అయితే యూజర్లు తాత్కాలికంగా ఫోన్లలో జీమెయిల్‌కు బదులుగా డెస్క్‌టాప్‌లో జీమెయిల్‌ను ఉపయోగించాలని కోరింది. తాము ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలియజేసింది.
ఇక మరోవైపు దీనిపై శాంసంగ్ కూడా స్పందించింది. శాంసంగ్ ఫోన్లను వాడుతున్న యూజర్లు ఒక సెట్టింగ్ చేస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చని ఆ సంస్థ తెలిపింది. అందుకు గాను యూజర్లు ఫోన్‌లో ఉండే సెట్టింగ్స్‌లోని యాప్స్ అనే విభాగంలోకి వెళ్లి అక్కడ పై భాగంలో కుడివైపు కార్నర్‌లో ఉండే మూడు డాట్స్‌పై ట్యాప్ చేయాలి. తరువాత షో సిస్టమ్ యాప్స్ అనే ఆప్షన్‌లో ఉండే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలోని అన్ఇన్‌స్టాల్ అప్‌డేట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీంతో ఈ సమస్య నుంచి బయట పడవచ్చని శాంసంగ్ తెలిపింది.