దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. ఇక విశాఖలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య మరువక ముందే మరో ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిపై కత్తితో దాడి చేసి అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. విశాఖ వన్ టౌన్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని ఫెర్రివీధికి చెందిన యువతి వాలంటీర్‌గా పనిచేస్తోంది. ఆమె మరొకరితో చనువుగా ఉంటోందని అనుమానం పెంచుకున్న ప్రియుడు శ్రీకాంత్ ఆమెపై కత్తితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి ఇంట్లో ఉన్న సమయంలో మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. దాడి అనంతరం శ్రీకాంత్ హత్యాయత్నం చేసినట్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం శ్రీకాంత్ కూడా మెడపై కత్తితో దాడి చేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు గమనించి ఇద్దరినీ కేజీహెచ్ కు తరలించారు. ప్రియాంక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇద్దరూ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు, శ్రీకాంత్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కొన్ని ఫేస్‌బుక్‌లో కనిపించాయి. ప్రస్తుతం ఈఎన్‌టీ వైద్యుల పర్యవేక్షణలో బాధితురాలికి చికిత్స అందుతోంది. ఆమె గొంతు దగ్గర కోయటంతో తీవ్ర రక్తస్రావం అయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.