“ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మార్పు అంటే ఎలా ఉంటుందో చూపిస్తా“- ఇదీ ఏడాదిన్నర కిందట జరిగిన ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అధినేతగా జగన్ ఇచ్చిన హామీ. ఆయన పాదయాత్రలోనూ ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. ప్రజలు దీనిని విశ్వసించారు. అధికారం కట్టబెట్టారు. ఆయన అధికారం చేపట్టి.. ఏడాదిన్నర అయింది. మరి ఈ ఏడాదిన్నరలో వచ్చిన పెద్ద మార్పు ఏదైనాఉందా? అంటే.. ఖచ్చితంగా ఉందని ఇటు ప్రభుత్వం ఎంత నమ్మకంగా చెబుతోందో… అంతే ధైర్యంగా ప్రజలు కూడా ఒప్పుకొంటున్నారు. ఔను.. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక మంచి మార్పు వచ్చింది. అని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో ముక్తకంఠంతో వినిపిస్తున్న మాట ఇది!
మరి ఈ మార్పు ఏంటి? ఇంత సంచలనాన్ని ఎలా సృష్టించింది? అనే విషయాన్ని పరిశీలించే ముందు.. గతంలో రాష్ట్రాన్ని పద్నాలుగేళ్లు ఏలానని చెబుతున్న చంద్రబాబు కూడా ఇలాంటి మార్పు తీసుకురాలేదనే విషయాన్ని మేధావులు సైతం ఒప్పుకొంటుండడం గమనార్హం. ప్రజల వద్దకు పాలనను చేరవేయడం ఏ ప్రభుత్వానికైనా ప్రధాన లక్ష్యం. దీనికి సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అన్ని ప్రభుత్వాలు ఇలానే ప్రయత్నాలు చేస్తున్నాయి. చేస్తాయి కూడా. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు కూడా ఏ సర్కారూ ఈ విషయంలో సంపూర్ణంగా సక్సెస్ సాధించింది లేదు. ఇక, తానే సీనియర్‌నని చెప్పిన చంద్రబాబు కూడా ప్రజల వద్దకు తన పాలనను చేరువ చేయలేక పోయారు.
కానీ, జగన్ అధికారం పీఠం ఎక్కీ ఎక్కడంతోనే ప్రజల వద్దకు పాలనను చేరువ చేసేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. ఎక్కడా ఎలాంటి మాధ్యమాన్నీ ఆయన నమ్ముకోలేదు. సొంతంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తాను ప్రజలకు ఏది చేయాలనుకున్నారో.. తాను ప్రజలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమల చేయాలని సంకల్పించారో.. వాటిని పూర్తిగా ప్రజలకు చేరువ చేసేందుకు, ప్రజలు తమకష్టాలను నేరుగా ప్రభుత్వానికి వెల్లడించుకునేందుకు ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశంలో ఇలాంటి ప్రయోగం చేయడం ఏపీలోనే అందునా జగన్ సర్కారులోనే ప్రథమం కావడం సంచలనం రేపింది. ఈ వ్యవస్థను గత ఏడాది ఆగస్టు 15న ఏర్పాటు చేశారు.
ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా పనిచేసేలా.. వారిని తీర్చిదిద్దారు. ఫలితంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకుచెక్ పెట్టడంతోపాటు.. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో తన వ్యూహానికి రెండు వైపులా పదును ఉంటుందని జగన్ నిరూపించారు. ఈ వ్యవస్థను తమ రాష్ట్రాల్లోనూ ఏర్పాటు చేసేందుకు తమిళనాడు, ఒడిసా, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ముందుకురావడం గమనార్హం. అంతేకాదు, కరోనా వంటి కీలక ప్రమాదం సమయంలో ఈ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు చేసిన సేవ అజరామరమంటూ.. బ్రిటీష్ హైకమిషనర్ కూడా ఇటీవల ప్రశంసలతో ముంచెత్తారు.