ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతున్న విషయం విదితమే. అనేక దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందిస్తున్నారు. ఇక మన దేశంలో ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్లకు కోవిడ్ టీకాలను ఇస్తున్నారు. అయితే ప్రపంచంలో ఇప్పటి వరకు 130 దేశాలకు కనీసం ఒక్క కోవిడ్ వ్యాక్సిన్ డోసు కూడా అందలేదని, ఇది చాలా అన్యాయమని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో సమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ ప్రపంచంలో మొత్తం వ్యాక్సిన్లలో 75 శాతం వ్యాక్సిన్ల డోసులు 10 దేశాల వద్దే ఉన్నాయని అన్నారు. ప్రపంచంలో 130 దేశాలకు ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ అసలు సరఫరా కాలేదని తెలిపారు. ఇది దారుణమని, ప్రపంచంలో అన్ని దేశాలు సమానమే అని, పేద దేశాల ప్రజలకు కూడా వ్యాక్సిన్ చేరాల్సి ఉందని అన్నారు.
పేద దేశాల ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించేందుకు అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు, టీకా తయారీ కంపెనీలు ముందుకు రావాలని గుటెరస్ వ్యాఖ్యానించారు. పేద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు జి20 దేశాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఇక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ ఆంటోని బ్లింకెన్ మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోని అన్ని దేశాలు పొందేలా చేయాలని అన్నారు. అయితే వ్యాక్సిన్లను వేగంగా పంపిణీ చేస్తే కోవిడ్ ముప్పు త్వరగా అంతమవుతుందని తెలిపారు.