మోదీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేది : అనురాగ్ కశ్యప్

-

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. మోదీ నాలుగేళ్ల క్రితం ఈ సూచన చేసి ఉంటే బాగుండేదని, ఇప్పటికే బాలీవుడ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆల్‌మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్’ ట్రయిలర్ విడుదల సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇప్పటికే చేయి దాటిపోయాయని, ఎవరి మాట ఎవరూ వినే పరిస్థితుల్లో లేరని అన్నారు. మూకలు కట్టుతప్పాయని అన్నారు. పఠాన్ సినిమా వివాదం నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో ‘బాలీవుడ్ బాయ్‌కాట్’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కోరారు. ఈ క్రమంలోనే ప్రధాన నరేంద్రమోదీ ఈ సూచన చేసినట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ అగ్రనటుడు షారుఖ్ ఖాన్-దీపిక పదుకొణె నటించిన ‘పఠాన్’ సినిమా రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సినిమాను నిషేధించాలని పలువురు డిమాండ్ చేశారు. అంతేకాదు, ‘బాలీవుడ్ బాయ్‌కాట్’ అంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఇటీవల బీజేపీ నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సినిమా వివాదాలపై స్పందించారు. సినిమాల విషయంలో అనవసర వివాదాల్లో తల దూర్చవద్దంటూ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version