ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన సీనియర్ రాజకీయవేత్త అగరాల ఈశ్వర్ రెడ్డి(87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వర్ రెడ్డి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1933 డిసెంబర్ 28న చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం తూకివాకం గ్రామంలో ఈయన జన్మించారు. 1957లో తూకివాక గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ఆయన.. రెండోసారి తిరుపతి నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
1981-82లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అనంతరం కొన్నాళ్లపాటు స్పీకర్‌గా పని చేశారు. 1983లో టీడీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయారు. తిరుపతిలో ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓటమి చవిచూశారు. అంతేకాదు, సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన ఇటీవలే సమర్థించారు. కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజధాని ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.