ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్ప్తోంది. ఉదయం 11 గంటలకు సచివాలయం లో మొదటి బ్లాక్ లో ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. కృష్ణా డెల్టా ఆయకట్టును పరిరక్షించేందుకు ప్రకాశం బ్యారేజీ కింద మరో రెండు బ్యారేజీలు నిర్మించడం సాధ్యాసాద్యల మీద క్యాబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలానే రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇక రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా వ్యయానికి ఇకపై నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో కొత్తగా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీవో) ల నియామకానికి కూడా క్యాబినెట్ లో చర్చ జరగనుంది. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున 51 డీడీవో పోస్టులుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలానే జిఎస్టి పరిహారం పై కేంద్రం కొత్త పల్లవి అందుకోవడం పైన కాబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఏక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో పరిహారాన్ని చెల్లించకపోవడం అప్పులు చేసుకోమడం పైన చర్చించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రం మీద ధిక్కార స్వరం వినిపిస్తారా ? లేక సర్దుకు పోతారా ? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.