కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెదేపా అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. భాజపా వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలను ఏకం చేయాలనే లక్ష్యంతో అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు జాతీయ నేతలతో చర్చించేందుకు చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరాజయంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, దేశ వ్యాప్తంగా భాజపేతర పార్టీలతో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, దిల్లీ సీఎం కేజ్రీవాల్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఈ నెల 19న కోల్‌కతాలో బహిరంగ సభ తర్వాత దేశవ్యాప్తంగా నిర్వహించే భారీ ర్యాలీలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ తెదేపా ఎంపీలతోనూ ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు.