దావోస్ లో జగన్ ఉన్నారు. మరోవైపు కోనసీమలో గొడవలు ఉన్నాయి. రెంటికీ సంబంధం లేదని అనుకోవద్దు. జిల్లాల ఏర్పాటు పేరిట రగులుతున్న యుద్ధం మరో రూపం దాల్చింది. అసలు గోదావరి జిల్లాల విభజనే బాలేదని చాలా మంది అంటున్నారు. అసలు కొత్త జిల్లాలు ఏర్పాటు ఎందుకు చేశారు ఎవరిని అడిగి చేశారు అని కూడా అంటూ, ఇదే సందర్భంలో కొందరు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కోనసీమ జిల్లాకు జీఎంసీ బాలయోగి పేరు పెడితే బాగుండు అని కొందరు, కాదు అంబేద్కర్ పేరు పెట్టండి అని ఇంకొందరు అన్నారు. కానీ మొదటిది నెరవేరలేదు. రెండోది రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుతో సహా కొందరు ప్రజా ప్రతినిధుల చొరవ కారణంగా సాధ్యం అయింది. కానీ ఇది ఇప్పుడు కొత్త వివాదాలు మోసుకువస్తుందే తప్ప ! పాత కాలంలో ఉన్న విధంగా సామరస్య పూర్వక ధోరణికి అయితే సంకేతం ఇచ్చే విధంగా లేదు. ఈ దశలో తగువు ఎందాక పోనుంది.. కులాల మధ్య పోరు ఇది అని కొందరు అంటుంటే వైసీపీలో కొందరు టీడీపీలో కొందరు కలిసి వివాదం పెంచుతున్నారని ఇంకొందరు అంటున్నారు. అంటే వివాదంలో రెండు పార్టీలూ ఉన్నాయా? అన్న సందేహాలూ రేగుతున్నాయి.
ప్రస్తుతం కోనసీమ దద్దరిల్లిపోతోంది. పేరు మార్పే ఇందుకు కారణం. తమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టవద్దని కొందరు మూకుమ్మడిగా ఆందోళనలకు దిగారు. ఈ ఘటన సంచలనాత్మకం అయింది. ఆందోళనలు అదుపు తప్పి కొందరు యువకులు ఉద్రిక్తతలకు ప్రేరేపిస్తూ ఎస్పీ పై రాళ్లు రువ్వారు. అదేవిధంగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిని తగులబెట్టాలని చూశారు. కొన్ని మీడియా సంస్థలు నిరసనకారులు ఆ పని కూడా చేశారని అంటున్నాయి. ఏ విధంగా చూసుకున్నా ఇక్కడ విధ్వంసం కొనసాగుతోంది. ఓ విద్యాసంస్థకు చెందిన బస్సును సైతం తగులబెట్టేరు. కోనసీమ జిల్లా సాధన సమితి పేరిట చాలా అంటే చాలా గొడవలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రశాంత సీమలో వివాదాలు ఇప్పట్లో ఆగేలా లేవు.