ఇండస్ట్రీ సమస్యలు తీర్చడంలో జగన్ ముందున్నారు. అందుకు చిరుకు ఎంతగానో సహకరించారు. ఆ రోజు చిరు విన్నపం విని జగన్ తన వాదం అటుంచి ఇండస్ట్రీ మాట విని వారి విన్నపాన్ని పెద్ద మనసుతో మన్నించి గొప్ప సాయం చేశారు. ఇందుకు జగన్ కూ, చిరుకూ ఇరువురికీ ఇండస్ట్రీ రుణపడి పోవాలి. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయమై సవరించిన జీఓను వీలైనంత త్వరగా విడుదల చేయించడంతో జగన్ పెద్ద సినిమాలకు అండగా నిలిచారు. ఐదో షో కు కూడా అనుమతి ఇచ్చి మరో మంచి నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటనీ దృష్టిలో ఉంచుకుని ఆచార్య టీం తనవంతుగా ఆయనకు సముచిత స్థానం కల్పించి, భారీ సన్మానం చేయాలని కూడా అనుకుంటోందని సమాచారం. అన్నీ కుదిరితే ఒకే వేదికపై అటు పొలిటికల్ మెగాస్టార్ జగన్ ఇటు మెగాస్టార్ చిరు ఉండడం సాధ్యమే!
ఆచార్య సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. అంతకుమునుపే తెలుగు లోగిళ్లలో పండగ వాతావరణం ఒకటి నెలకొంటోంది. ఎందుకంటే పెద్ద సినిమాలు అన్నీ మంచి విజయాలు సాధించాయి. ట్రిపుల్ ఆర్, నేరు చిత్రం కాకపోయినా మన ఇంటి కుర్రాడే అనిపించేలా యష్ నటించిన కేజీఎఫ్ (చాప్టర్ 2) కూడా మంచి విజయాలు అందుకున్నాయి. అదేవిధంగా చిన్న సినిమాలు మంచి పేరే తెచ్చుకుంటున్నాయి. డీజే టిల్లు కూడా ఓ విధంగా మంచి టాక్ తోనే ఇప్పటికీ చాలా చోట్ల డిస్కషన్ పాయింట్ గా ఉంది. టిక్కెట్ రేట్లు మారిన తరువాత విడుదలయిన సినిమాలన్నీ అనూహ్య విజయాలు అందుకున్నాయి.
ఈ విషయమై చిరు చేసిన ప్రయత్నం ఓ గొప్ప ఫలితం ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీ వర్గాలు చిరుకు ముఖ్యంగా ఇందుకు ఎంతో సహకరించిన సీఎం జగన్ కూ అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రికి తోచిన రీతిన సన్మానించుకునే తరుణం రానేవచ్చిందని కూడా అభిప్రాయపడుతున్నాయి. ఇందుకు సరైన సమయం రానే వచ్చిందని, కృష్ణా తీరాన రాయల సీమ ముద్దు బిడ్డ జగన్ కు ఓ ఆత్మీయ సత్కారం అందించాలని భావిస్తోంది ఆచార్య టీం. త్వరలో జరగనున్న ప్రీ రిలీజ్ వేడుకలకు ఏపీ సీఎం రానుండడమే ఇందుకు ప్రధాన కారణం. ఆ విధంగా ఆచార్య టీం కల నెరవేరబోతోంది.
అన్నయ్య చిరు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. చాలా రోజులకు ఆయన ప్రత్యేకమయిన ఆనందంలో ఉన్నారు. తాను ఆనందంగా ఉండడమే కాదు పరిశ్రమ యావత్తూ ఆనందంగా ఉండేందుకు కూడా కారణం అవుతున్న తరుణంలో ఓ కొత్త వార్త వెలువడింది. శుభ వార్త అని రాయాలి. ఈ వార్త అనుసరించి అన్నయ్య చిరు వేడుకలకు ఏపీ సీఎం జగన్ రాబోతున్నారు. దీంతో ఈ వార్త విని చాలా మంది ఆంధ్రాలో మెగాభిమానులు తెలంగాణలో ఉన్న మెగాభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విజయవాడ సిద్ధార్థ్ కాలేజీలో ఈ నెల 23న నిర్వహించే వేడుకలకు ఆయన అతిథిగా హాజరై కొణెదల వారింటి అభిమానులను అలరించనున్నారు.