దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు జడ్జీనే టార్గెట్ చేస్తూ, సిజేఐకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సుప్రీం న్యాయమూర్తి ఎన్‌వి రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులని ప్రభావితం చేస్తున్నారని, టీడీపీ అధినేత చంద్రబాబు డైరక్షన్‌లో పనిచేస్తు..ఏ కేసు ఏ బెంచ్ మీదకు వెళ్లాలో డిసైడ్ చేస్తున్నారని సుప్రీం సిజేఐ జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు జగన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మన తెలుగు మీడియాలో కూడా భిన్న కథనాలు వస్తున్నాయి. మామూలుగానే మీడియా పార్టీల వారీగా విడిపోయిన విషయం తెలిసిందే. ఓ వర్గం మీడియా అధికార వైసీపీకి అనుకూలంగా ఉంటే, మరో వర్గం మీడియా ప్రతిపక్ష టీడీపీకి అనుకూలంగా నడుస్తుంది.
దీంతో వైసీపీ అనుకూల మీడియా ఎన్‌వి రమణదే తప్పు అని జగన్‌కు అనుకూలంగా కథనాలు ఇస్తుంది. అలాగే జాతీయ స్థాయిలో ఎవరైనా రమణపై చర్యలు తీసుకోవాలని మాట్లాడితే, దాన్ని పెద్దగా హైలైట్ చేస్తూ ప్రచారం చేస్తుంది. తాజాగా సుప్రీం న్యాయమూర్తి ప్రశాంత్ భూషణ్… ఏపీ సీఎం వైఎస్ జగన్ సీజేఐకి లేఖ రాసి మంచి పని చేశారని అన్నారు. అలాగే ఆ లేఖను బహిరంగ పరిచి మరింత మంచి పని చేశారని ప్రశంసలతో ముంచెత్తారు.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు సీఎం జగన్ రాసిన లేఖపై అత్యంత నిజాయితీపరులైన ముగ్గురు రిటైర్డ్ జడ్జీలతో విచారణ కమిటీ వేయాలని ప్రశాంత్ భూషణ్ డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదే విషయాలని వైసీపీ మీడియా బాగా ప్రచారం చేస్తుంది. ఇటు టీడీపీ అనుకూల మీడియాలో కూడా కొందరు న్యాయ ప్రముఖులు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖను బహిరంగపరచడం కోర్టు ధిక్కరణ కింద వస్తుందని పలువురు న్యాయ కోవిదులు వాదిస్తున్నారు. అసలు పలు కేసుల్లో నిందితుడుగా ఉంటూ, బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి న్యాయస్థానాలపై దాడికి దిగడం దారుణమని అంటున్నారు.
న్యాయమూర్తిపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడమే కాక, దాన్ని బహిరంగపరచడం తీవ్ర పరిణామమని మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ బిశ్వజిత్ భట్టాచార్య ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీలపై జగన్ సర్కార్ ఫిర్యాదు చేయడం ద్వారా న్యాయవ్యవస్థ స్వతంత్రతకే ముప్పు ఏర్పడుతుందని తెలంగాణ మాజీ అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణా రెడ్డి చెబుతున్నారు. మొత్తానికైతే తెలుగు మీడియా న్యాయవాదులపై జగన్ చేస్తున్న పొరతంపై భిన్నవిధాలుగా రాజకీయం నడిపిస్తుంది.
-vuyyuru subhash