ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు ఒక హామీ ఇస్తే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అలా కాకుండా మాట తప్పితే, ప్రజలే ఆ నాయకుడుని పక్కనబెడతారు. గతంలో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి, ఆ హామీలని పూర్తిగా అమలు చేయకుండా మాట తప్పారు. అందుకే గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని పక్కనబెట్టి జగన్‌ని అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇక జగన్ కూడా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ జగన్, బాబు మాదిరిగా కాకుండా ఇచ్చిన హామీలని అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. కాకపోతే కొన్ని హామీల విషయంలో జగన్ కూడా మాట తప్పుతున్నట్లు కనిపిస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యపాన నిషేధం విషయంలో. అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
అందుకు తగ్గట్టుగానే అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు మూసివేశారు. అలాగే కొన్ని వైన్ షాపులని తగ్గించి, మిగిలిన షాపులని ప్రభుత్వమే నడుపుతుంది. ఇదే క్రమంలో మద్యం రేట్లని విపరీతంగా పెంచారు. అదేమంటే రేట్లు పెరిగితే మందు తాగే వాళ్ళు తగ్గుతారని చెప్పారు. కానీ అలా జరుగుతున్నట్లు కనిపించడం లేదు. పైగా నాసిరకమైన మద్యాన్ని అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. అది కూడా అధిక ధరలకు. ఇక అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. మరి వచ్చే మూడేళ్లలో మద్యపాన నిషేధం అయ్యేలా కనిపించడం లేదు. పైగా మద్యం మీద వచ్చే ఆదాయాన్ని షూరిటీగా పెట్టి జగన్ ప్రభుత్వం అప్పు తెచ్చిందని, ఇక మద్యపాన నిషేధం లేదని ప్రతిపక్ష టీడీపీ చెబుతోంది.
అయితే మద్యం ప్రభావం వచ్చే ఎన్నికల్లో జగన్‌కు భారీ నష్టమే తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఓ వైపు మద్యపాన నిషేధం జరగపోతే కొందరు మహిళల ఓట్లు లాస్ అవ్వాలి. అలాగే నాసిరకం మద్యం, అధికార ధరలకు మద్యం అమ్మడం లాంటి అంశాలు కూడా జగన్‌కు చాలా ఓట్లు దూరమయ్యేలా కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మద్యపాన నిషేధం జగన్ కొంపముంచేలా ఉందని తెలుస్తోంది.