ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఈ సారి ఎలాగైనా ఎన్నికలు జరిగి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దృఢ నిశ్చయం తో ఉన్నారు. అయితే గతంలో తమను సంప్రదించకుండా ఎన్నికలు రద్దు చేశారని కోపమో ? లేకపోతే కరోనా కేసులు ఉన్నాయనో తెలీదు కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. కానీ కోర్టులో మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధమని ఎన్నికల కమిషనర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అలాగే ఈ ఫిబ్రవరిలో ఎన్నికల గురించి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టుకు సమాచారం కూడా అందించారు.
అలాగే ఈరోజు జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిమ్మగడ్డ రమేష్ కు నీలం సహాని లేఖ రాయడం సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఇంకా అదుపులోకి రాలేదని లేఖలో పేర్కొన్న నీలం సహాని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కరోనా యాక్టివ్గా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం సహా పోలీసుల అందరూ ఆ కేసులను కట్టడి చేసే విధుల్లో ఉన్నారని ఈ సమయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం సరికాదని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఈ రోజు మధ్యాహ్నం జిల్లా యంత్రాంగం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని భావించారు నిమ్మగడ్డ. సి ఎస్ లేఖతో ఈ సమావేశాలు రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆయన గవర్నర్ తో ఈ రోజు సమావేశం కానున్నారు. ఈ గవర్నర్ భేటీ అనంతరం ఈ విషయం మీద మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.