ఆంధ్రప్రదేశ్ అధికారులకు ముఖ్యమంత్రి జగన్ నుంచి కీలక ఆదేశాలు వెళ్లాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పది రోజుల క్రితం రాజధాని విషయంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానులు అంటూ ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటనపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగుతుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
అటు విశాఖలో మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల్లో మాత్రం రాజధాని మార్చొద్దు అనే నిరసనలు, విజ్ఞప్తులు వినపడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులకు కీలక ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. అమరావతిని కాళీ చేసి రావాలని, విశాఖలో రాబోయే రెండు నెలల్లో సెటిల్ అవ్వాలని ఆదేశించారట. రాలేని ఉద్యోగులు విధుల నుంచి కూడా తప్పుకోవాలని చెప్పినట్టు సమాచారం. సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఇప్పటికే,
తమ కుటుంబాలను విశాఖకు తరలించారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా చాలా మంది విశాఖ వెళ్ళిపోయినట్టు సమాచారం. ఒకపక్క రాజధాని విషయంలో ప్రభుత్వంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గే సూచనలు కనపడటం లేదు. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులు ఆ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు వైజాగ్ వెళ్ళడంతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.