రాష్ట్రంలో అవినీతిని సహించేది లేదంటోంది జగన్ సర్కార్. ప్రభుత్వ అధికారులు ఎవరైనా అవినీతి ప్రోత్సహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీఎం. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లకే మేనిఫెస్టోలోని అనేక అంశాలను వరుస పెట్టి అమలుచేస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఇప్పటికే 80 శాతానికిపైగా మేనిఫెస్టో అమలుచేశామంటున్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్షం నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. వాటిని లెక్కచేయకుండా ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.
కృష్ణా, గుంటూరు జిల్లాలోని అర్హులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాల్లోని అర్హులైన పేదవారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీని నిమిత్తం సీఆర్డీఏ పరిధిలోని తాడేపల్లి, పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల మండలాలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో అర్హులకు భూములను కేటాయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 54,307 మంది లబ్దిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది. కాగా, నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో భూములను అర్హులకు ఇవ్వనున్నారు.