ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పబోతుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ శాఖలు, విభాగాల వారీగా క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఉద్యోగాల భర్తీకి సంబంధించి అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలను సేకరించి దానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఖాళీల వివరాలకు సంబంధించి క్యాలెండర్ ను మే 31న విడుదల చేయనున్నట్లు సీఎస్ వెల్లడించారు.ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చెయ్యాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను సీఎస్ ఇటీవల ఆదేశించారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీల్లో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. కాగా త్వరలోనే ఖాళీల వివరాలకు సంబంధించి క్యాలెండర్ విడుదల కానుండడంతో అభ్యర్థులు ఇప్పటినుండే సన్నద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు.