ఏపీకి మూడు రాజధానులు ఖరారు, హైపవర్ కమిటి ఇదే చెప్పింది…!

-

అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ పరిపాలన వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటి అభిప్రాయపడింది. విజయవాడలోని ఆర్టీసి కాంప్లెక్స్ లో మంగళవారం సాయంత్రం ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన కమిటి తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిందేనని హైపవర్ కమిటీ పేర్కొంది.

జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల అవసరం ఉందని పరోక్షంగా కమిటి స్పష్టం చేసింది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి ఏ విధంగా జరగాలి? అన్ని ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉండాలి? అనే అంశాలపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, బీసీజీ నివేదిపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పిన ఆయన, ప్రస్తుతం అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణపై రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయని, కమిటీలు ఇచ్చిన నివేదికలు విశ్లేషించుకొని ముందుకు వెళ్లేందుకే ఈ హైపర్ కమిటీని సీఎం ఏర్పాటు చేశారన్నారు.

సుదీర్ఘంగా 4 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో తామిచ్చిన నివేదికల సారాంశాన్ని జీఎన్ రావు, బీసీజీ ప్రతినిధులు హైపవర్ కమిటీకి వివరించగా, విశాఖ నగరాన్నే రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారని ఈ సందర్భంగా మంత్రులు ప్రశ్నించారు. గ్రీన్ ఫీల్డ్ రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ భరించలేదనే విషయాన్ని తమ అధ్యయనంలో వెల్లడైందని, ఏపీలో విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తే రాష్ట్రాభివృద్ధికి చోదక శక్తి అవుతుందని మంత్రులు అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేసారు.

అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని, రాజధాని రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని, రైతుల ముందు రెండు-మూడు ఆప్షన్లను ఉంచాలని కమిటి అభిప్రాయపడింది. ప్రతి జిల్లాలోనూ కీలక ప్రాజెక్టులు, చేపట్టాల్సిన అభివృద్ది పనులపై హైపవర్ కమిటీ దృష్టి సారించింది. త్వరలో హైపవర్ కమిటీ మరో సమావేశం నిర్వహించి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బుగ్గన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version