ఇరాన్ అమెరికా మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి. తమ టాప్ కమాండర్ గా ఉన్న ఖాసీం సులైమానిని అమెరికా బాగ్దాద్ విమానాశ్రయంలో హత్య చేసిన తర్వాత పగ తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. ఖాసీం అంత్యక్రియల సందర్భంగా కూడా ఇరాన్ అమెరికాకు కీలక హెచ్చరికలు చేసింది. తాము వెనక్కు తగ్గేది లేదని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
ఇప్పుడు ముందు చెప్పినట్టు గానే ఇరాన్ దాడులకు దిగింది. అమెరికాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది ఇరాన్. పగతో రగిలిపోతున్న ఇరాన్ తమ పొరుగుదేశమైన ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది. అసద్, ఎర్బిల్ బేస్‌లపై దాదాపు 12 క్షిపణులతో ఇరాన్ సైన్యం భారీ దాడులు చేసింది. అమెరికా సైన్యాన్ని టార్గెట్ చేసింది.
ఈ సందర్భంగా అమెరికా మిత్ర దేశాలపైనా దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఆ దేశం అమెరికా దాని మిత్ర దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదిలా ఉంటే ఇరాక్, ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా భారీగా సైన్యాన్ని మోహరించిన సంగతి తెలిసిందే.