నచ్చకపోతే బిగ్​బాస్ చూడొద్దు : ఏపీ హైకోర్టు

-

బుల్లితెరపై వచ్చే కార్యక్రమాల్లో అశ్లీలతపై అభ్యంతరం ఉంటే వాటిని చూడొద్దని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయంలో నేరుగా హైకోర్టును ఆశ్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఆ వివరాలను కౌంటర్‌ రూపంలో కోర్టు ముందుంచాలని స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాటీవీ ఎండీని హైకోర్టు ఆదేశించింది. ఎవరు ఏమి మాట్లాడాలో చెప్పేపని కోర్టులది కాదని పేర్కొంది.

బిగ్‌బాస్‌ షో కంటే మించిన అశ్లీలత ఉండే కంటెంట్‌ వివిధ వేదికల ద్వారా అందుబాటులో ఉందంది. రియాల్టీ షోపై అభ్యంతరం ఉంటే చూడొద్దని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ పి.వెంకట జోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

బిగ్‌బాస్‌పై నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫు న్యాయవాది కోరడంతో ధర్మాసనం… విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version