ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడంపై తెలంగాణా సర్కార్ జాగ్రత్త పడుతుంది. అటు మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు పెరగడంపై కూడా ప్రభుత్వంలో కంగారు మొదలయింది. పది వేలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని ఎవరిని కూడా ఆ రాష్ట్రాల నుంచి రాకుండా చూడాలని సిఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.
ఇక తాజాగా తెలంగాణా ప్రభుత్వం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల వైపు వెళ్లకుండా తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం ప్రకటించింది. సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలు వైద్యం, అత్యవసర పనులకు కూడా ఏపీ, మహారాష్ట్రల్లోకి వెళ్లడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కేసీఆర్ సర్కార్.
దానిని అమలు చేయడానికి గానూ భారీగా సరిహద్దుల్లో పోలీసు బలగాలను పెంచింది. ఏపీలోని కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడికి గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు పదే పదే వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో ఎవరూ కూడా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్ళడానికి వీలు లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేసింది. ఖమ్మం, నల్గొండ జిల్లాల వారు విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి కూడా నిషేధం విధించింది.