ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదల సొంతింటి కళ అయిన ఇళ్ల పట్టాల పంపిణీ పథకం శ్రీకాకుళం జిల్లాలో కొంతమంది చోటా నాయకుల చేతి వాటం వలన చెడ్డపేరు వచ్చింది. ఈ అంశం రెండు మూడు రోజుల నుండి చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశం మీద రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పలాసలో జరిగిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇళ్ల పట్టాల కోసం మందసలో కొంతమంది డబ్బులు వసూలు చేయడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. చంద్రుని చూడటమంటే చంద్రునిలోని మచ్చను చూసే ఈ రోజుల్లో ఎంతో నిబద్ధతతో పని చేస్తున్నప్పటికీ వ్యవస్థలో ఇలాంటి చిన్న చిన్న తప్పు లు మచ్చ తెస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఎవరైనా పట్టాలు కోసం డబ్బులు అడిగితే ఇవ్వొద్దని, ఏ కష్టమొచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయాలని అన్నారు.