AP MPTC ZPTC Elections Result: ఉత్కంఠ‌.. ప‌రిష‌త్ కౌంటింగ్ ప్రారంభం.. ఫ‌లితాలు నేడే..

-

AP MPTC ZPTC Elections Result: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభ‌మైంది. బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెల‌కొంది. నెలల కొద్ది ఎదురుచూస్తున్న‌ అభ్యర్థుల భవితవ్యం మ‌రి కొన్ని గంట‌ల్లో తేల‌నున్న‌ది. ఉదయం ఎనిమిది గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల్లోగా ఈ కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేసి.. విజేత‌ల‌ను ప్ర‌క‌టించనున్నారు అధికారులు. ఇందుకోసం యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. 42వేల 360 మంది సిబ్బంది ఎన్నికల కౌంటింగ్‌ విధుల్లో పాల్గొంటున్నారు

AP MPTC ZPTC Elections Result

సిబ్బంది, ఏజెంట్లు కరోనా నిబంధనలు పాటించాలని, ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఇప్ప‌టికే కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. 50, 100 మీటర్ల చొప్పున రెండంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో నోటీఫికేష‌న్ విడుద‌ల కాగా.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ 8 న 7220 స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నిక‌ల్లో 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. నేడు వారి భ‌విత్వం తేల‌నున్న‌ది.

ఇక రాష్ట్రంలో మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 660 ఉండగా..652 స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అభ్యర్ధులు మరణించడం వల్ల మరో 11 స్థానాల్లో కూడా పోలింగ్ అగిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తానికి 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2058 అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. మధ్యాహ్నం కల్లా ఎంపీటీసీ ఫలితాలు వెలువడే అవకాశముంది. రాత్రి నాటికి జిల్లా పరిషత్ ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news