– రాజధాని ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
– పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్తత
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంతంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సచివాలయం ముట్టడికి ర్యాలీలుగా బయలుదేరారు.
ఈ క్రమంలోనే తుళ్లూరు మండలంలోని మందడంలో పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. దీంతో సచివాలయానికి వెళ్లే మందడం రోడ్డును కార్మికులు దిగ్భందించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్ర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కార్మికులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
దీని కారణంగా తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. పోలీసులు, కార్మికుల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం, తోపులాటల మధ్య సీఐటీయూ అధ్యక్షుడు బాబూరావు నేలపై పడిపోయారు. పరిస్థితి మరింత గందరగోళంగా మారడంతో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. ఓ మహిళా కార్మికురాలి ముక్కుకు గాయమై తీవ్ర రక్తస్రావం అయింది.
దీనిపై కార్మికులు స్పందిస్తూ.. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే పోలీసులు ఝులుమ్ ప్రదర్శించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనీ, ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబాల పూటగడవడం ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. తమకు న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.