దేవుడి విషయాల్లో కూడా నాలుక మడతేనా?

-

నాడు చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆ ప్రభుత్వంలో బీజేపీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా.. మరో బీజేపీ నేత టీటీడీ సభ్యుడిగా ఉండగా… టీటీడీలోని నిరర్థక ఆస్తుల్ని అమ్మాలంటూ దాదాపుగా మూడేళ్ల పాటు చేసిన కసరత్తు చేశారు! నాడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కూడా బీజేపీ నే అన్నసంగతి కాసేపు పక్కన పెడితే… 2015 జులై 28న జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిరర్థక ఆస్తుల విక్రయాలపై చర్చ సాగింది.. తక్కువ విస్తీర్ణంలో ఉన్న భూముల్ని అమ్మటమే మంచిదని అప్పటి టీటీడీ బోర్డు భావించింది.

2018 మార్చి 28న ఈవో.. తిరుపతి జేఈవో.. ఎస్టేట్స్ ఆఫీసర్ లు సమావేశమై.. నాలుగు కేటగిరిలో ఉన్న ఆస్తుల గురించి సమీక్షలు జరిపారు. మొత్తంగా టీటీడీ ఆస్తుల్ని బహిరంగ వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించారు. అంటే… నేడు వైకాపా ప్రభుత్వ సమయంలో జరుగుతున్న టీటీడీ భూముల అమ్మకానికి సంబందించి నిర్ణయాలు అన్నీ నాడే జరిగిపోయాయి అన్నమాట! ఈ విషయంలో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అయితే… జగన్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీని వెనుక హిందుత్వంపై కుట్ర దాగి ఉందనే అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాజీ లేని పోరాటం చేస్తుందని స్పష్టం చేస్తున్నారు!

మరి నేడు విమర్శలు చేస్తున్నవారంతా గతంలో ఏమయ్యారయ్యా అంటే మాత్రం వీరి నుంచి స్పందన కరువు అనే సంగతి అలా ఉంచితే… గతంలో బీజేపీ నేత దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా.. మరో బీజేపీ నేత టీటీడీ సభ్యుడిగా ఉండగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయం చంద్రబాబుతో పాటు నేటి బీజేపీ నేతలు మరిచిపోవడం హాస్యాస్పదం కాకమరేమిటి?

నేతలు అంటే మారిన పార్టీలకు అనుగుణంగా మాటలు మారుస్తుంటారు… కారణం నాలుకకు నరం ఉండదు కాబట్టి అని సరిపెట్టుకోవచ్చు కానీ… గత ప్రభుత్వాలు చేసిన తీర్మాణాలు, తీసుకున్న నిర్ణయాలు… నేటి ప్రభుత్వాలు అమలు చేస్తున్నా కూడా… గతంలో తమకు ఇంత జ్ఞానం లేదు.. ఇప్పుడే కొత్తగా వచ్చింది అన్నస్థాయిలో స్పందించడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!

ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే… గతంలో ఈ భూములు అమ్మాలని నిర్ణయించినప్పుడు టీడీపీ సభ్యులుగా ఉండి, ఈ నిర్ణయాల్లొ కీలక భూమిక పోషించిన బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి అయితే ఏకంగా.. టీటీడీ ఆస్తుల పరిరక్షణ కోసం ఉపవాస దీక్ష చేయనున్నట్లు తెలిపారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా ప్రజల విషయాల్లోనే కాదు ఆఖరికి దేవుడి విషయాల్లో కూడా నాలుకలు మడత పెడతారన్నమాట మన నాయకులు అని కామెంట్లు వినిపించడం ఈ సందర్భంగా గమనార్హం!

Read more RELATED
Recommended to you

Exit mobile version