ప్రభుత్వం ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టింది : వెంకట రామిరెడ్డి

-

ఈ క్యాబినెట్ లోనూ ఉద్యోగులకు నిరాశే అని ఏపీ సెక్రెటరియేట్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతున్నా ఉద్యోగుల గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదు. ప్రభుత్వం ఉద్యోగులకు ఒక్క డిఏ ఇవ్వలేదు, IR ఇవ్వలేదు, DA బకాయిలు, GPF బకాయిలు, EL సరెండర్ బకాయిలలో ఒక్క బిల్లు చెల్లించలేదు. కనీసం రాజీనామా చేసిన పిఆర్సి కమిషన్ స్థానంలో కొత్త పిఆర్సి కమిషనర్ ను కూడా నియమించలేదు. అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా సచివాలయ ఉద్యోగులు శాఖాధిపతుల ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం దానిపై స్పందించడం లేదు. కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికీ కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మేము ఒత్తిడి చేయకుండా వేచి చూశాము. కానీ నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యహరించడం దారుణం. 2019లో అప్పటి ప్రభుత్వం జులై 1 నుంచే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చింది. నూతన సంవత్సర కానుకగా, మనందరీ పెద్ద పండుగ అయిన సంక్రాంతికి అయినా IR ప్రకటిస్తారని అందరూ ఈరోజు జరిగిన క్యాబినెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కూడా ప్రభుత్వం ఉద్యోగులు ఆశలపై నీళ్లు చల్లింది. గతంలో ప్రభుత్వం రెండు మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు చర్చించి ఇవి చేస్తాము ఇవి చేయలేమని కనీసం చెప్పేవారు. అలాగే పెండింగ్ బకాయిలు ఇంత ఉన్నాయి ఫలానా టైమ్ కి కొంత ఫలానా టైమ్ కి కొంత ఇలా దశలవారీగా చెల్లిస్తామని చెప్పేవారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా కొందరు ఉద్యోగులను వేధించడం మొదలుపెట్టింది. సచివాలయంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ స్థాయి అధికారులు ఆరు మందిని ఎలాంటి కారణాలు లేకుండా బదిలీ చేసి పోస్టింగ్ ఇవ్వకుండా నెలలు తరబడి గాల్లో పెట్టింది. వారిలో ఇంకా ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. సీనియర్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా వేధించడం అన్యాయం. అంతటితో ఆగకుండా అందులో ఒక అధికారికి అడిషనల్ సెక్రటరీ ప్రమోషన్ కు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, DPC కమిటీ కూడా ప్రమోషన్ కు అనుమతి ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వకుండా ఆపడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే ఈ ముగ్గురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము అని వెంకట రామిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news