ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఐఫోన్ 12 ఫోన్ల విడుదల తేదీని చెప్పేసింది. సెప్టెంబర్ 15వ తేదీన యాపిల్ ఓ వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అందులో ఐఫోన్ 12 ఫోన్లను విడుదల చేయనుంది. అలాగే అదే ఈవెంట్‌లో నూతన యాపిల్ వాచ్‌తోపాటు ఐఓఎస్ 14పై కూడా యాపిల్ ప్రకటన చేస్తుందని తెలిసింది.
సెప్టెంబర్ 15వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు యాపిల్ వర్చువల్ ఈవెంట్ ప్రారంభం అవుతుంది. అందులో భాగంగా యాపిల్.. ఐఫోన్ 12కు చెందిన 4 మోడల్స్ ను విడుదల చేస్తుందని సమాచారం. 5.4, 6.1 ఇంచుల డిస్‌ప్లేలతో రెండు బడ్జెట్ ఐఫోన్ 12 మోడల్స్ ను, 6.1, 6.7 ఇంచుల డిస్‌ప్లే సైజులతో రెండు హై ఎండ్ ఐఫోన్ 12 మోడల్స్ ను యాపిల్ విడుదల చేస్తుందని తెలిసింది. ఇక వీటన్నింటిలోనూ 5జి ఫీచర్‌ను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
ఐఫోన్ 12 ఫోన్ల డిస్‌ప్లేలను కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారని సమాచారం. అవి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటాయని తెలిసింది. దీని వల్ల డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. దృశ్యాలు స్మూత్‌గా కనిపిస్తాయి. ఈ ఫోన్లన్నింటిలోనూ ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తారని సమాచారం. అయితే ఐఫోన్ 12 ఫోన్లకు చెందిన పూర్తి వివరాలు ఈవెంట్‌లోనే తెలుస్తాయి.