సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తన నూతన ఐఫోన్లను ఇవాళ విడుదల చేయనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు యాపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. అందులో యాపిల్ సంస్థ ఐఫోన్ 12 ఫోన్లను విడుదల చేయనుంది. ఇక ఆ ఈవెంట్‌కు హాయ్, స్పీడ్ అని పేరు పెట్టారు.
కాగా కరోనా నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వర్చువల్‌గా యాపిల్ నిర్వహించనుంది. యాపిల్ పార్క్ నుంచి ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీన్ని https://www.apple.com/apple-events/ అనే యాపిల్ ఈవెంట్స్ సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. అలాగే యూట్యూబ్‌లో యాపిల్ చానల్‌లో లైవ్ స్ట్రీమ్ వస్తుంది. వీటిలో ఎందులోనైనా యాపిల్ ఫోన్ల లాంచింగ్ ఈవెంట్‌ను లైవ్‌లో చూడవచ్చు.
ఇక ఆ ఈవెంట్‌లో యాపిల్ నాలుగు ఐఫోన్ 12 మోడల్స్‌ను విడుదల చేస్తుందని సమాచారం. ఐఫోన్ 12, 12 ప్రొ, 12 ప్రొ మ్యాక్స్, 12 మినీ పేరిట మొత్తం నాలుగు ఐఫోన్లను యాపిల్ విడుదల చేస్తుందని తెలిసింది. వీటిల్లో ప్రధానంగా 5జి ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. వీటితోపాటు హోమ్‌పాడ్ పేరిట స్మార్ట్ స్పీకర్‌ను కూడా యాపిల్ విడుదల చేస్తుందని సమాచారం.
ఐఫోన్ 12 మినీ ధర 699 డాలర్లు (దాదాపుగా రూ.51,200) ఉంటుందని తెలిసింది. అలాగే ఐఫోన్ 12 ధర 799 డాలర్లు (దాదాపుగా రూ.58,600), 12 ప్రొ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ73,200), 12 ప్రొ మ్యాక్స్ ధర 1099 డాలర్లు (దాదాపుగా రూ.80,600) ఉంటుందని తెలిసింది. భారత్‌లో అయితే ఈ ధరలకు అదనంగా మరో 18 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఇక వీటన్నింటిలోనూ ఓలెడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారని సమాచారం. యాపిల్ ఎ14 బయానిక్ చిప్‌సెట్ ఉంటుందని ఇది వరకే తెలిసింది. ఇక ఐఫోన్ 12 మినీ 5.4 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తుండగా, ఐఫోన్ 12, 12 ప్రో ఫోన్లు 6.1 ఇంచుల డిస్‌ప్లేలతో, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ 6.7 ఇంచుల డిస్‌ప్లేతో వస్తుందని తెలుస్తోంది.