యాపిల్ వాచ్‌లు ఎంతో మంది ప్రాణాలను గతంలో కాపాడాయి. అందులో ఉన్న హెల్త్ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎవరైనా ఆ వాచ్‌లను ధరిస్తే చాలు, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటే ముందుగానే వాచ్‌లలో తెలియజేస్తాయి. ఇక తాజాగా యాపిల్ వాచ్ ఇంకో వ్యక్తి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళితే..
లాంగ్ ఐలాండ్ అనే ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల బ్రాండన్ ష్నయిడర్ ఇటీవల ఒక రోజు బాత్ రూమ్‌లో పడిపోయాడు. దీంతో అతను వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే అప్పుడు అతను యాపిల్ వాచ్‌ను ధరించి ఉన్నాడు. దీంతో అందులో ఉన్న ఫాల్ డిటెక్షన్ ఫీచర్ అతను కింద పడిపోయినట్లు గుర్తించింది. వెంటనే అలర్ట్ మెసేజ్‌ను పంపింది.
అయితే కిందపడ్డా ఏమీకాకపోతే స్పృహలో ఉంటే ఆ మెసేజ్ ను 45 సెకన్లలో టర్న్ ఆఫ్ చేయవచ్చు. దీంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కింద పడ్డాక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు కనుక ఆ మెసేజ్ ను ఆఫ్ చేయలేదు. ఈ క్రమంలో అతనికి ఎమర్జెన్సీ ఉందని గ్రహించిన యాపిల్ వాచ్ అందులో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్ నంబర్‌లకు వెంటనే సమాచారం ఇచ్చింది. దీంతో అక్కడికి సమీపంలో ఉన్న బ్రాండన్ తండ్రి వెంటనే అతని ఇంటికి వచ్చి అతన్ని హాస్పిటల్‌లో చేర్పించాడు.
కాగా బ్రాండన్ కింద పడడం వల్ల పుర్రె ఎముక కొద్దిగా చిట్లిందని, లోపల రక్తం గడ్డ కట్టిందని, అయితే అతనికి ప్రస్తుతం ప్రమాదం ఏమీ లేదని, శస్త్ర చికిత్స చేసినందున కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అతను 4 రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి ఎట్టకేలకు ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అయితే యాపిల్ వాచ్ గనక కింద పడ్డ విషయాన్ని గుర్తించి ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం అందించకుండా ఉంటే, అంటే యాపిల్ వాచ్ లేకపోయి ఉంటే.. ఈపాటికి బ్రాండన్ చనిపోయి ఉండేవాడు. కానీ అలా జరగలేదు. ఈ క్రమంలో యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడినందుకు అతను ఎంతో సంతోషంగా ఫీలవుతున్నాడు.