ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి (రెండు పార్ట్‌లు) సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. అందులో నటించిన అందరికీ పేరు వచ్చింది. ప్రభాస్, రానాలు జాతీయ స్థాయి నటులుగా స్టార్ డమ్ సంపాదించారు. అయితే బాహుబలి మూవీలో కాలకేయుల ప్రస్తావన ఉంటుంది. సినిమా కోసం కాలకేయులు అనే వారిని సృష్టించారా ? అని దీనిపై చాలా మందికి ఇప్పటికీ సందేహమే ఉంది. అయితే కాలకేయులు అనేవారు కల్పితం కాదు. మహాభారతంలో వీరి ప్రస్తావన ఉంది.
కౌరవులతో కలిసి శకుని ఆడిన మాయా జూదంలో పాండవులు ఓడిపోతారు. తరువాత వారు కట్టుబట్టలతో అరణ్యానికి చేరుకుంటారు. అనేక అరణ్యాల్లో తిరుగుతూ వారు ఒక సారి అగస్త్య మహాముని ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ ఆయన వారికి అనేక కథలు చెబుతారు. వాటిల్లో కాలకేయుల కథ కూడా ఒకటి. ఆ కథ ఇది.
కాలకేయులు రాక్షసులు. వారు సముద్రంలో నివసిస్తుంటారు. రాత్రి పూట మాత్రమే బయటకు వస్తారు. అలా వచ్చినప్పుడు వారు నివసించే సముద్రానికి సమీపంలో ఉండే బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తుండేవారు. ఈ క్రమంలో కాలకేయులను చంపడం దేవతలకు కూడా సాధ్యంకాదు. దీంతో వారు అగస్త్యుడి వద్దకు వచ్చి కాపాడమని వేడుకుంటారు. దీంతో ఆ ముని సముద్ర జలాన్నంతా ఒక్క గుక్కలో తాగేస్తాడు. అప్పుడు కాలకేయులు సముద్రం నుంచి బయట పడతారు. తరువాత దేవతలు వారితో యుద్ధం చేసి అనేక మంది కాలకేయులను చంపేస్తారు. అయినప్పటికీ కొందరు కాలకేయులు ఇంకా మిగిలే ఉంటారు. వారు పాతాళంలోకి పారిపోతారు. ఆ తరువాత సముద్రం నీళ్లు లేకుండా ఖాళీ ఉంటుంది. దీంతో భగీరథుడు గంగను భూమి మీదకు రప్పిస్తాడు. ఇదీ.. కాలకేయుల కథ..