బరువు పెరగడం, తగ్గడం పెద్ద సమస్యగా మారిపోయింది. చాలా మందికి ఇదొక పెద్ద టాస్క్ లా మారింది. మరీ సన్నగా ఉన్నవారు బరువు పెరిగి బాగా కనిపించాలనీ, మరీ లావుగా ఉన్నవారు బరువు తగ్గి నాజూగ్గా కనిపించాలని విశ్వప్రయత్నాలు చేస్తుంటారు. ఐతే లావు పెరగడానికైనా, తగ్గడానికైనా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టం ఉన్నట్టుగా ఏది పడితే అది తిని లావు కావాలని ప్రయత్నించడం సరికాదు. అలాగే లావు తగ్గాలన్న ఉద్దేశ్యంతో అస్సలు తినకుండా ఉండడమూ సరికాదు. సరైన డైట్ నిర్ణయించుకుని, ఆ డైట్ వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి సమస్య లేదనిపిస్తే అప్పుడు ఆ డైట్ ఫాలో అవ్వాలి.
ముఖ్యంగా లావు పెరగాలని ఆలోచించేవారు రకరకాల ఆహారాలని భోజనంగా తీసుకోవాలని చూస్తుంటారు. గుడ్లు, మాంసం, చేపలు, చికెన్, మటన్, బీన్స్, పండ్లు మొదలగునవి. వాటన్నింటిలోకి అతి ముఖ్యమైనది అరటి పండు. అవును చాలామంది లావు పెరగాలనుకునే వారు రోజుకో అరటి పండు తినాలని అనుకుంటారు. మీకు తెలిసిన వారికెవరికైనా లావు పెరగాలంటే ఏం చేయాలని అడిగితే వారు చెప్పే సమాధానం, రోజూ ఒక అరటి పండు తినమనే ఉంటుంది.
అరటి పండు తినడం వల్ల బరువు పెరగడం నిజమే. కానీ దాన్నెలా తినాలి. ఏ టైమ్ లో తినాలనేది తెలుసుకోకపోతే ఇబ్బందుల పాలు కాక తప్పదు. అరటి పండులో ఉండే అధిక కేలరీలు బరువు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఐతే అది తినే సమయం చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదం ప్రకారం అరటి పండు తినడానికి అనువైన సమయం ఉదయం 8గంటల నుండి 11గంటల లోపు మాత్రమే. ఆ తర్వాత తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా సాయంత్రం, రాత్రిపూట అరటి పండు తినడం అంత శ్రేయస్కరం కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.