రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ గోస్వామిని కష్టాలు చుట్టుముట్టాయి. ఆయన చుట్టూ ముంబై పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. టెలివిజన్ చానెళ్ల రేటింగ్ (టీఆర్‌పీ) కుంభకోణంలో ఇంగ్లిష్ న్యూస్ చానెల్ రిపబ్లిక్ టీవీ అధినేత అర్నబ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే రిపబ్లిక్ టీవీ చానెల్ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎ్‌ఫవో) ఎస్ సుందరంతో పాటు మరి కొందరు సీనియర్ ఉద్యోగులు, యాజమాన్యానికి సన్నిహితులుగా భావిస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. శనివారం కూడా విచారణకు రావాలని చెప్పారు. వీరి విచారణ తర్వాత ఆర్నాబ్‌నుకూడా పిలిపించే అవకాశాలున్నాయని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం రిపబ్లిక్ టీవీ ఆడిట్ రిపోర్టులను, బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు క్షుణ్నంగా పరిశీ లిస్తున్నారు. అసలు రిపబ్లిక్ టీవీ చానెల్‌ను పెట్టడానికి, నడపడానికి డబ్బు ఎలా వచ్చింది అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నట్లు ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. ఇదిలా ఉంటే అర్నబ్ మాత్రం ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించడంలేదు. పోలీసు కేసులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ‘నేనో సైనికాధికారి కొడుకుని. జీవితంలో ఎన్నడూ ఓడిపోవడం నేర్చుకోలేదు. ఇపుడూ అంతే… ఈ కక్ష సాధింపును ఎలా ఆపాలో నాకు తెలుసు’ అని అర్థం వచ్చే కవితా పంక్తులను తన ప్రైమ్‌టైమ్ షోలో చదివి వినిపించారు. ‘దీని వెనుక సోనియా, రాహుల్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఉన్నారు. ఇదంతా పెద్ద కుట్ర. లేనిపోని ఆరోపణలు చేసినందుకు ముంబై పోలీస్ చీఫ్ పరమ్‌వీర్ క్షమాపణలు చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.