నేను దేవమానవుడు అంటూ చంకలు గుద్దుకుని అత్యాచారం కేసులో అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చి చివరికి దేశం వదలిపారిపోయిన నిత్యానంద అలియాస్ నిత్యానంద స్వామికి విరుద్దంగా నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని రామనగర సెషన్స్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తనని తాను దేవుడిగా చెప్పుకునే నిత్యానంద స్వామిపై ఆయన మాజీ డ్రైవర్ లెనిన్ 2010లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై లైంగిక దాడి కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నాడు నిత్యానందను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తర్వాత నుంచి కనిపించలేదు. కాగా, దేశం నుంచి పారిపోయిన నిత్యానంద, కైలాస అనే దీవిలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రచారం చేసుకున్నాడు.
ఆ దీవిని ప్రత్యేక దేశంగా పేర్కొన్న ఆయన, దానికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అయితే ఆ దీవి ఎక్కడ ఉందో అన్నది ఎవరికీ అంతుపట్టలేదు. మరోవైపు నిత్యానంద దేశం నుంచి పారిపోవడంతో అతడి మాజీ డ్రైవర్ లెనిన్ మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. 2019 నుంచి కోర్టు విచారణకు కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో నిత్యానందకు మంజూరు చేసిన బెయిల్‌ను 2020లో కోర్టు రద్దు చేసింది. అలాగే ఆయనపై నమోదైన లైంగిక దాడి కేసు విచారణ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. పలు సమన్లు జారీ చేసినప్పటికీ నిత్యానంద ఎక్కడ ఉన్నాడో అన్నది పోలీసులకు తెలియలేదు. దీంతో రామనగర సెషన్స్ కోర్టు గురువారం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.