దిల్లీ, పంజాబ్ లలో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు తన ఫోకస్ గుజరాత్ పై పెట్టింది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్రంలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. తాజాగా కేజ్రీవాల్ మరోసారి గుజరాత్ వెళ్లారు.
ఈసారి గుజరాత్ వెళ్లిన కేజ్రీవాల్ అక్కడి బీజేపీ కార్యకర్తలకు ఓ ఆసక్తికర ముచ్చట చెప్పారు. బీజేపీలోనే ఉంటూ ఆప్ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నుంచి వచ్చే ముడుపులు ఎంజాయ్ చేస్తూనే ఆప్ కోసం పనిచేయాలని కోారారు. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ కార్యకర్తలు కూడా తమ పార్టీ అందించే ఉత్తమ సేవలను పొందుతారని తెలిపారు. నాణ్యమైన విద్య, వైద్యం, 24గంటల ఉచిత విద్యుత్తును ఆప్ అందిస్తుందని.. ఆ ప్రయోజనాలను భాజపా కార్యకర్తలు కూడా పొందుతారని పేర్కొన్నారు.
‘మేం పిరికివాళ్లం కాదు, భయపడబోం. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడతాం. గుజరాత్‌లోని ఆరు కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేమున్నాం. 27 ఏళ్ల దుష్పరిపాలనకు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.