అమెరికా టెక్సాస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వలసజీవులు నది దాటుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరికొంత మందిని కాపాడినట్లు అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి.
అసలేం జరిగిందంటే.. అమెరికా టెక్సాస్ లోని ఈగిల్ పాస్ సమీపంలోని రియో గ్రాండే నదిలో మునిగి 8 మంది వలసదారులు మరణించారు. ఈ విషయాన్ని అమెరికా సరిహద్దు భద్రతా బలగాలు వెల్లడించాయి. ఆరు మృతదేహాలను తాము వెలికితీయగా.. మెక్సికన్ బృందాలు మరో రెండు మృతదేహాలను బయటకు తీశాయని అధికారులు తెలిపారు.
అధిక వర్షాల కారణంగా ప్రవాహం పెరిగిందని.. అందుకే వలసదారులు నదిని దాటే సమయంలో మరణించినట్లు పేర్కొన్నారు. వలసదారులు ఏ దేశం నుంచి వచ్చారో ఇంకా తెలియలేదని అమెరికా అధికారులు తెలిపారు. నీటిలో మునిగిన 37 మంది బాధితుల్ని కాపాడామని చెప్పారు. సరిహద్దుకు ఇరువైపులా బాధితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.