Arvind Trivedi: 1980వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్ త్రివేది (82) కన్నుమూశారు. గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మంగళవారం అర్థరాత్రి గుండెపోటు వచ్చిందని అరవింద్ త్రివేది మేనల్లుడు కౌష్తుబ్ త్రివేది తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆయన అంతిమ సంస్కారాలు బుధవారం ముంబైలోని కాండివాలి వెస్ట్‌లో ఉన్న శ్మశానవాటికలో జరుగుతాయన్నారు. బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించిన ధారావాహిక ‘రామాయణ్ . ఈ సిరీయల్ లో రావణుడి పాత్రను అరవింద్ త్రివేది పోషించారు. ఆ పాత్రతో ఆయనకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఢిల్లీ రామ్ లీలాలో జరిగే రామాయణంలో రావణ్ పాత్రధారి కూడా అరవింద్ త్రివేదిని అనుకరిస్తుంటరంటే.. ఆయన నటన ఎలాంటిదో చెప్పనకరలేదు.
అరవింద్ తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరియర్‌లో హిందీ, గుజరాతీ సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. దాదాపు 300 సినిమాల్లో నటించి.. మెప్పించారు. ఆయన నటనలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా రాణించారు. 1991 లో బీజేపీ తరుపున పోటీ చేసి గుజరాత్‌లోని సబర్కథ నుండి ఎంపీ అయ్యారు. 2002, 2002 లో అతను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యాక్టింగ్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.