తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రాజకీయ వేడిని పెంచింది. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభావేదికగా ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీతో సహా ఎంఐఎంను సవాల్ చేసేందుకు తాను తెలంగాణకు వచ్చానని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ లోక్‌సభ నుంచి బరిలోకి దిగాలన్న అసద్.. వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కూడా ఓడిపోతారన్న విషయం తనకు తెలుసని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నుంచి పోటీ చేసి, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చురకలంటించారు ఒవైసీ. హైదరాబాద్ కాదంటే.. మెదక్ నుంచి కూడా పోటీకి దిగొచ్చని పేర్కొన్నారు ఒవైసీ .