మధ్య ప్రదేశ్ లోని ఖర్గోన్ నగరంలో శ్రీరామనవమి వేడుకలపై హింసకు పాల్పడ్డ వ్యక్తుల ఆస్తులను కూల్చివేసింది ప్రభుత్వం. కాగా ఈ ఘటనపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఏ చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఇళ్లను కూల్చివేసిందని… ఇది ఖచ్చితంగా రాజ్య హింస, జెనీవా ఒప్పందానికి విఘాతం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముస్లింల పట్ల పక్షపాతంగా వ్యహరిస్తున్నారంటూ విమర్శించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక మరియు గోవా ప్రభుత్వాలు రామనవమి ఊరేగింపు సందర్భంగా హింసను నియంత్రించడంలో విఫలమయ్యాయని ఆరోపించాడు.
శ్రీరామనవమి సందర్భంగా ఊరేగింపు చేస్తున్న వారిపైకి మరోవర్గం దాడి చేసింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన ఖర్గోన్ నగరంలో చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఆరుగురు పోలీసులతో పాటు 24 మందికి గాయపడ్డారు. ఖర్గోన్ ఎస్పీ సిద్ధార్గ్ చౌదరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈఘటనలో 84 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. ఘర్షణలకు పాల్పడ్డ వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. నగరంలో అత్యంత సున్నితమైన చోటీమహల్ టాకీస్ ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రభుత్వం అల్లర్లకు పాల్పడ్డ ఆస్తుల్ని కూల్చివేసింది.