సంగారెడ్డి నియోజకవర్గం తెరాస అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను బలపరుస్తూ ఆదివారం ఎంఐఎం ఏర్పాటు చేసిన బహిరంగసభలో అసదుద్దీన్ ఓవైసీ తెరాసను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ…గతంలో ఎన్నడు లేని విధంగా ముస్లిం సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు తెరాస ప్రభుత్వం కేటాయించింది, పేద ముస్లింలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, షాదీ ముబారక్ లాంటి పథకాలతో పాటు 204 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు, ముస్లిం విద్యార్థులకు ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ సదుపాయాన్ని కల్పించిన ఘనత తెరాస అధినేత కేసీఆర్ సాబ్ కే దక్కుతుందన్నారు.
గత ప్రభుత్వానలు ఉర్దూ భాషను నిర్వీర్యం చేసేలా వ్యవహరించారన్నారు. కేసీఆర్ సాబ్ ఉర్దూ అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చార్మినార్‌కు వచ్చి, తమపై విమర్శలు చేయడాన్ని గుర్తు చేస్తూ… కాంగ్రెస్ ని నమ్ముకుని ఇన్నాళ్లు వారికి అండగా ఉంటే వారి వల్ల ముస్లింలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. సామాన్యులకు ఏది కావాలో అది సీఎం కేసీఆర్ అందించారని మరో సారి తెరాసను అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రం మరింత జోష్ గా పరుగులు పెడుతుందన్నారు.